రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు
రాజస్థాన్‌లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో బుధవారం జైపూర్ లో అర్థరాత్రి వరకు సమావేశం నిర్వహించారు. భేటీలో రాష్ట్ర బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో కీలక వ్యూహాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ప్రారంభమైన సమావేశం అర్థరాత్రి 2 గంటల వరకు సాగింది. ఈ క్రమంలోనే కాషాయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరు కేంద్రమంత్రులను అధిష్ఠానం కోరనుంది.
అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు
ఈ ఊహాగానాల నేపథ్యంలో తెల్లవారు జాము వరకు జరిగిన సుధీర్ఘ చర్చలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సహా పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపనున్నట్లు ప్రచారం సాగుతోంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న అమిత్ షా, నడ్డా హోటల్‌లో భేటీ నిర్వహించారు. తొలి 15 నిమిషాలు మాజీ సీఎం వసుంధర రాజేతో చర్చించినట్లు తెలుస్తోంది.అనంతరం ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాంపై సమాలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలవాలని కషాయదళం భావిస్తోంది. పార్టీలో ఐక్యమత్యమే ప్రధానమని చెప్పేందుకు ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఎవరి పేరును ఎంపిక చేయకపోవడం గమనార్హం.