Rekha Gupta: ఆప్ నుంచి విమర్శలు.. ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని దిల్లీ మాజీ సీఎం అతిషి మార్లెనా చేసిన విమర్శలకు కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు.
"కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్ల పాటు దిల్లీని పాలించాయి.మీరంతా ఇన్నేళ్లలో ఏమి చేసారో ముందుగా చూసుకోండి. మేము అధికారంలోకి వచ్చి ఒక్క రోజైనా పూర్తికాకముందే విమర్శలు చేయడం తగదు? మేము మొదటి రోజే క్యాబినెట్ సమావేశం నిర్వహించాం.బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించాం. దీని ద్వారా ప్రజలకు రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందుబాటులోకి వస్తుంది.
ఆప్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయకపోయినప్పుడు,మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి ఎలా ఉంటుంది?" అంటూ రేఖా గుప్తా ప్రతిస్పందించారు.
వివరాలు
మొదటి రోజే ఆ హామీని విస్మరించింది
ప్రధాని మోదీ నాయకత్వంలో దిల్లీ తన హక్కులను సంపాదిస్తుందని ఆమె పేర్కొన్నారు.
అలాగే, "ముందు మీ పార్టీ గురించి చూసుకోండి. మీ పార్టీలోనే ఎందరో వెళ్లిపోవాలని చూస్తున్నారు. కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతో ఆందోళన చెందుతున్నారు," అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఆతిశీ చేసిన ఆరోపణలపై ప్రత్యామ్నాయంగా వచ్చాయి.
ఆతిశీ మాట్లాడుతూ, "బీజేపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ మొదటి రోజే ఆ హామీని విస్మరించింది," అని విమర్శించారు.
వివరాలు
దిల్లీ సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం
దీనిపై సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ, "అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తాం. ఒక్కరోజు కూడా వృథా చేయకుండా దిల్లీ అభివృద్ధి కోసం పనిచేస్తాం. పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రవేశపెడతాం," అని స్పష్టం చేశారు.
గురువారం రాత్రి 7 గంటలకు ఆమె అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం దిల్లీ సచివాలయంలో జరిగింది. ఆ తర్వాత మంత్రులతో కలిసి యమునా ఘాట్‌కు వెళ్లి హారతి నిర్వహించారు.