AP News: విశాఖ,తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: కందుల దుర్గేశ్
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
సినీ పరిశ్రమ ప్రగతికి నూతన పాలసీని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు.
సినీ రంగ ప్రముఖులతో చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రోత్సాహంపై మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా, ఈ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
వివరాలు
స్టూడియోల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు
రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో చర్చించినట్లు చెప్పారు.
హైదరాబాద్ తరహాలో స్టూడియోల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో అద్భుతమైన చిత్రీకరణ స్థలాలు (లొకేషన్లు) ఉన్నాయని, స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వమే కాకుండా పీపీపీ మోడల్‌లో కూడా స్టూడియోల ఏర్పాటుకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వివరాలు
గిరిజనుల భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
ఇంతకుముందు విశాఖలోని రామానాయుడు స్టూడియో కోసం 34 ఎకరాలు కేటాయించగా, గత ప్రభుత్వ హయాంలో 15 ఎకరాలను లేఅవుట్ల కోసం మళ్లించిన విషయం గుర్తుచేశారు.
అయితే రాబోయే రోజుల్లో మొత్తం 34 ఎకరాలను తిరిగి సినీ పరిశ్రమ వినియోగానికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని వెల్లడించారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ, 1/70 చట్టాన్ని సవరించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కానీ గిరిజనుల భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.