Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా
హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా (హైదరాబాద్ రీజినల్ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ రానుంది. 'ఔటర్ రింగు రోడ్' లోపలున్న కోర్ ఏరియాను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన 51 పంచాయతీలను హైడ్రా పరిధిలోకి చేర్చారు. శుక్రవారం జరిగిన రేవంత్ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
హైడ్రాలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు
హైడ్రాకు కేవలం అధికారులే కాకుండా, సిబ్బంది సంఖ్యని కూడా పెంచాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రా వాటర్ బోర్డు వంటి కీలక సంస్థలకు ప్రస్తుతం ఉన్న అధికారాలు కూడా త్వరలో హైడ్రాకు రానున్నాయి. ప్రత్యేకంగా ఔటర్ రింగు రోడ్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూసుకుంటుంది. హైడ్రా అధికార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 169 మంది అధికారులు, అలాగే 940 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నాలు
హైడ్రా విస్తరణతో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సౌత్ ప్రాంతంలో ఇటీవల అక్రమ నిర్మాణాలు పెరిగాయి. ఇక సన్‌సిటీ, కాళీ మందిర్, హైదర్షాకోట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, భవనాలు నిర్మించారని, వీటి విలువ అక్షరాలా రూ. 1500 కోట్లు ఉన్నట్లు సమాచారం. హైడ్రా రంగంలోకి దిగితే తమ అక్రమ నిర్మాణాలు ధ్వంసమవుతాయని భావించిన రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పటికే భయపడుతోంది. కొన్ని నిర్మాణాలను తక్కువ ధరకు అమ్మేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.