
Revanth Reddy: తెలంగాణలో స్వేచ్ఛ, సమాన అవకాశాలు, అభివృద్ధి: రేవంత్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజలు రాసుకున్న పోరాట చరిత్ర మనది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. "ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదే. నిన్నటి నియంత పాలనను సాయుధ పోరాట స్ఫూర్తితో పక్కన పెట్టాము. మా పాలనలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం స్థానం లేదు. స్వేచ్ఛ,సమాన అవకాశాలు,సామాజిక న్యాయంలో రోల్‌మోడల్‌గా ఉన్నాం.యువత ఉన్నత విద్య ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించాలి.భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం.త్వరలో రాష్ట్ర విద్యా విధానం కూడా ప్రవేశపెడతాం.సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అద్భుతమైనదే. చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం,ఆరుట్ల కమలాదేవి తమ సత్తాను చాటారు."
వివరాలు
రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు
"డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. రైతుల కోసం తీసుకొచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా, రైతులకు మేలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలను వెల్లడించాము. సివిల్స్ పరీక్షలకు సంబంధించిన ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాం."
వివరాలు
కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ధరణి' వల్ల రెవెన్యూ వ్యవస్థ గందరగోళానికి లోనైంది. ఆ తరువాత భూభారతి చట్టం తీసుకురావడం ద్వారా సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవం పెంచడానికి కృషి జరుగుతుందని, సన్నబియ్యం ఇవ్వడం ద్వారా పేదలకు సహకరించడం కొనసాగుతుందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ పడేది లేదు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. 904 టీఎంసీల సాధన కోసం ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపిస్తాం. కృష్ణా జలాల హక్కుల కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగు వేసేది లేదు అని రేవంత్ పేర్కొన్నారు.
వివరాలు
కాలుష్యం లేని హైదరాబాదే లక్ష్యం
హైదరాబాద్ నగరాన్ని "గేట్‌వే ఆఫ్ వరల్డ్"గా తీర్చిదిద్దుతామని కూడా అన్నారు. "హైదరాబాద్ ఒక బ్రాండ్ నగరం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలి. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావడం, కాలుష్యం లేని నగరంగా మార్చడం మా లక్ష్యం. మూసీ నది పక్కన నివసించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుతాం. మూసీ నదిని పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చతాము. ఈ ఏడాది డిసెంబర్ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తాము" అని రేవంత్ రెడ్డి తెలిపారు.
వివరాలు
త్వరలో మెట్రో విస్తరణ పనులు
మెట్రో విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని, తెలంగాణ అంటేనే పోరాటాలు, త్యాగాలకు వేదిక. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతాం.మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. వీటిని అరికట్టడంలో మన పోలీసులు సత్తా చాటారు. అలాగే, "తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తాము. డిసెంబర్ 9న రాష్ట్ర ప్రజలకు అందిస్తాము. దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే ఉద్దేశ్యంతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నాం. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రీజినల్ రింగ్ రోడ్ అభివృద్ధి సూచికగా ఉంటుంది. 12 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం" అని రేవంత్‌రెడ్డి తెలిపారు.