పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి భగభగలకు వేడి గాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా దేశంలోని నగరాలు వేడి గాలులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దిల్లీలో కూడా వరుసగా నాలుగు రోజులుగా 40 డిగ్రీలకు తగ్గకుండా ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వాయువ్య మైదానాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు
ఈ నెల ప్రారంభంలోనే వాయువ్య మైదాన, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా, ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న రోజుల్లో తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బిహార్‌లోని పాట్నా, బంకా, జాముయి, నవాడా, ఔరంగాబాద్, సుపాల్, అనేక ఇతర జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేశారు. బిహార్‌లోని బెగుసరాయ్, నలంద, గయా, అర్వాల్, భోజ్‌పూర్, రోహ్తాస్, బక్సర్, ఖగారియా, ముంగేర్ ప్రాంతాలలో కూడా 'గ్రీన్' హెచ్చరిక జారీ చేయబడింది.
రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్, కోల్‌కతాలో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. హర్యానా, పంజాబ్‌లలో ఉధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదున్నాయి. హర్యానాలోని హిసార్‌లో 41.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లోని భటిండాలో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీలు, కోటా, బన్స్వారా, ఫలోడి, ధోల్‌పూర్‌లో 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.