
సినీ ఫక్కిలో భారీ చోరీ.. దిల్లీలో గన్నులతో బెదిరించి డబ్బులతో జంప్
ఈ వార్తాకథనం ఏంటి
ద్విచక్ర వాహనాలపై వచ్చి కారును అడ్డగించిన దోపిడీ దొంగలు, గన్నులతో బెదిరించి డబ్బుల సంచిని దోచుకెళ్లారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకుంది.
ప్రగతి మైదాన్ టన్నెల్ లో జరిగిన ఈ భారీ చోరీ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. అయితే ఘటనపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న మరో ఎల్జీని నియమించాలన్నారు.
దిల్లీ శాంతిభద్రతలను కాపాడటం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతను తమకు అప్పగించాలని చురకలు అంటించారు.
రెడ్ ఫోర్ట్ ఏరియాకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ సహాయకుడితో కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్ లో ఇచ్చేందుకు బయల్దేరారు.
DETAILS
సంస్థకు చెందిన వారి సహకారంతో దోపిడీకి పాల్పడి ఉండొచ్చు : పోలీసులు
తమ బ్యాగ్ లో క్యాష్ ఉండటం వల్ల ముందు జాగ్రత్తగా క్యాబ్ బుక్ చేసుకున్నారు.
ఈ క్రమంలో కారు ప్రగతి మైదాన్ టన్నెల్ గుండా వెళ్తున్న క్రమంలో 2 బైక్ ల మీద వచ్చిన నలుగురు దుండగులు కారును నిలువరించారు.
అనంతరం తుపాకీలతో బెదిరించి నగదు బ్యాగుతో ఉడాయించారు. అయితే టన్నెల్ లోని సెక్యూరిటీ కెమెరాల్లో ఈ సంఘటన అంతా నమోదైంది.
చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
డెలివరీ సంస్థ ఉద్యోగుల గురించి ఆరా తీస్తూ సంస్థకు చెందిన వారి సహకారంతో ఇతరులెవరైనా ఈ దోపిడీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.