Robo Hotel Biryani : హోటల్లో డబ్బులతో బిర్యాని తిన్నాడు... ఫ్రీగా కారు గెలిచాడు
ఆంధ్రప్రదేశ్ తిరుపతి నగరంలో ఓ వ్యక్తి బిర్యాని తిని ఖరీదైన కారు గెలుపొందాడు. ఈ మేరకు రెండేళ్ల కిందట రోబో డైనర్ పేరుతో ఓ హోటల్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రెండో వార్షికోత్సవం సందర్భంగా హోటల్ యజమాని కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ స్కీమ్ ప్రవేశపెట్టారు. హోటల్‌లో బిర్యానీ తిని, తాము ఇచ్చే కూపన్ నింపాలని, ఫలితంగా డిసెంబరు 31న లక్కీ డ్రా తీస్తామన్నారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వ్యక్తికి కారును బహుమతిగా అందజేస్తామని ప్రకటించేశారు. లక్కీడ్రాలో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారును సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని దాదాపు రూ.7 లక్షల విలువైన కారును గెలుపొందడం గమనార్హం.
23వేలకుపైగా కూపన్లు
గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ ప్రవేశపెట్టిన వినూత్న స్కీమ్'లో భాగంగా రోబో హోటల్'లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి సంస్థ కూపన్ అందజేసింది. ఈ సందర్భంగా దాదాపుగా 23వేలకుపైగా కూపన్లు వచ్చి చేరాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి,నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూపన్ లక్కీ డ్రా తీశారు. దీంతో తిరుపతికి చెందిన రాహుల్ అనే వ్యక్తి పేరు రాగా,హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్'కు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నిస్సాన్ మ్యాగ్నెట్ కారును ఉచితంగా అందజేశారు.నగర వాసులకు హోటల్ చేరువకావాలనే ఈ స్కీం ప్రవేశపెట్టామని ఎండీ భరత్ కుమార్ రెడ్డి అన్నారు.