TSRTC Bill: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. బిల్లును అమోదించిన గవర్నర్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదించారు. ఇకపై తెలంగాణ ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో భాగం కానుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో గతంలో బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై గవర్నర్ కొన్ని అంశాలపై వివరణ కోరారు. అయితే ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన తమిళపై తాజాగా బిల్లుకు అమోద ముద్ర వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతేడాది రూ.3వేల కోట్ల అదనపు భారం పడనుంది.
43,055 మంది జీవితాల్లో వెలుగులు
గవర్నర్ ఈ బిల్లును ఆమోదించడంతో 43,055మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించనుంది. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలకు ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవలే మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి వేతనాలను పెంచారు.