
#NewsBytesExplainer: భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణిని యాక్టివేట్ చేసింది.. ఏమిటీ ఎస్-400?
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళాలు లేదా క్షిపణులతో దాడులకు దిగితే, అటువంటి దూకుడును నిలువరించే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థగా ఎస్-400 వ్యవస్థ ముందుంటుంది.
శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గమ్యానికి చేరక ముందే ధ్వంసం చేసే సత్తా దీనికి ఉంది.
ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో భారత భద్రతా బలగాలు ఈ వ్యవస్థను సక్రియంగా మోహరిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఎస్-400 అంటే ఏమిటి?
ఇది ఒక అధునాతన సంచార వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ.రష్యాలోని ఎన్పీవో అల్మాజ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.
మునుపటి ఎస్-300 వ్యవస్థ ఆధారంగా ఆధునికీకరణ చేసి ఈ ఎస్-400 రూపొందించారు.
ప్రస్తుతం దీని కన్నా మెరుగైన ఎస్-500 వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.ఈ వ్యవస్థ శత్రు దేశాల జామింగ్ (సిగ్నల్ డిస్టర్బెన్స్) ప్రయత్నాలను తట్టుకోగలదు.
అంతేకాదు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అధిక ఖచ్చితత్వంతో గుర్తించి తుడిచివేయగలదు.
వివరాలు
భారత్ - రష్యా ఒప్పందం
2018లో భారత్, రష్యా మధ్య 543 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది.
ఇందులో మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థల కొనుగోలు అంశం ఉంది. ఇప్పటివరకు మూడింటిని భారత్ అందుకుంది.
మిగిలిన రెండు వ్యవస్థలు 2026 ఆగస్టు నాటికి అందే అవకాశం ఉంది.
ఎస్-400 మోహరించిన ప్రదేశాలు
పాకిస్థాన్ నుంచి వచ్చే ముప్పును దృష్టిలో పెట్టుకుని పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కో ఎస్-400 వ్యవస్థ మోహరించినట్లు సమాచారం.
అలాగే చైనా వైపు నుంచి రక్షణ కరదీయాలని భావించి, అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో మరో వ్యవస్థను అమర్చినట్లు అంచనాలు ఉన్నాయి.
వివరాలు
స్వదేశీ పరిష్కారాలు - ప్రాజెక్ట్ కుశ
భారతదేశం కూడా స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ అభివృద్ధికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీంట్లో భాగంగా "ప్రాజెక్ట్ కుశ" చేపట్టింది. దీర్ఘశ్రేణి పరిధి గల ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం ఉన్న క్షిపణులపై ఇది దృష్టి సారించింది.
డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యవస్థ 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధిలో పని చేస్తుంది.
ఈ వ్యవస్థ కూడా స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు. సామర్థ్య పరంగా ఇది ఎస్-400కు మరియు ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్‌కు సమానమే.