
S Jaishankar: భారత్-రష్యా సంబంధాల్లో కొత్త దృష్టికోణం అవసరం: జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకు వెళ్లాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సూచించారు. బుధవారం (ఆగస్టు 20) మాస్కోలో రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్‌తో సమావేశమైన ఆయన, "మనం ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి అన్నదే మంత్రంగా ఉండాలి" అని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్-రష్యా సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా వాణిజ్య రంగంలో కొత్త అవకాశాలు వెతుక్కోవడం, ద్వైపాక్షిక వ్యాపారాన్ని విభిన్నం చేయడం, జాయింట్ వెంచర్లు పెంచుకోవడం వంటి అంశాలు రెండు దేశాల అజెండాలో ఉండాలని జైశంకర్ పేర్కొన్నారు.
వివరాలు
వచ్చే నెలల్లో భారత్ కు రష్యా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై 50 శాతం టారిఫ్ విధించడం, అదనంగా 25 శాతం సుంకం విధించడం వల్ల రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. వచ్చే నెలల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాలు
చమురు దిగుమతిలో భారత్ ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది: విదేశాంగ మంత్రిత్వశాఖ
ఇక అమెరికా తాజా హెచ్చరికలను భారత్ బలంగా ఖండించింది. ఆగస్టు 4న విడుదల చేసిన ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వశాఖ, రష్యా నుంచి చమురు దిగుమతి అనివార్యమని, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరాలు యూరప్ వైపు మళ్లడంతో భారత్ ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. "ఉక్రెయిన్ ఘర్షణ మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ప్రారంభించింది. అప్పట్లో అమెరికా కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరత్వానికి భారత్ కొనుగోళ్లు అవసరమని వారే ప్రోత్సహించారు" అని మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పేర్కొంది.