Karnataka: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (ఎస్‌ఎం కృష్ణ) 92 ఏళ్ళ వయస్సులో మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున 2.30-2.45 గంటల మధ్య తన నివాసంలో కన్నుమూశారు. అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు ఆయన కర్ణాటక సీఎంగా, 1993-1994 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1999లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించి, ఆ ఎన్నికల విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009-2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి చెప్పి, 2017 మార్చిలో బీజేపీలో చేరారు.
మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం
2023లో కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎం కృష్ణను ప్రజా వ్యవహారాల రంగంలో అసమాన సేవలకు గాను పద్మవిభూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. బెంగళూరు నగరాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి కారణంగా, అది సిలికాన్ వ్యాలీగా ప్రఖ్యాతి గాంచింది. విద్యార్హతల పరంగా, సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ (డల్లాస్) జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్న కృష్ణ, 1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ తరఫున అమెరికాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కెన్నెడీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, కృష్ణ చేసిన కృషికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కృష్ణ, అనంతరం మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.