Samagra Kutumba Survey: రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే..మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ
మీరు ఏమేం ఆస్తులు కలిగి ఉన్నారు, ఎంత రుణం తీసుకున్నారో, మీ ఆదాయం ఎంత వంటి వివరణలను తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించనుంది. ఈ నెల 6వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలు అడిగేలా గణకులను సిద్ధం చేశారు. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, కొన్ని ప్రశ్నలకు ఉప ప్రశ్నలు ఉంటాయి. ఈ సర్వేలో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి ఫోన్ నంబరు, వృత్తి/ఉద్యోగ వివరాలు కూడా సేకరిస్తారు.
విదేశాలకు వెళ్లినవారికి ప్రత్యేక కోడ్
కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లయితే, వారు ఎందుకు వెళ్లారో ప్రత్యేకంగా తెలుసుకుంటారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి కారణాలతో బయటకు వెళ్లినవారికి వివిధ దేశాలకు ప్రత్యేక కోడ్లను ఉపయోగిస్తారు. రుణాలు, ఆస్తులపై ప్రశ్నలు కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు, వారు తీసుకున్న రుణాల కారణాలు వంటి సమాచారాన్ని సేకరించే విధానం కూడా ఉంది. వీటిలో బైకులు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి చరాస్తుల వివరాలను కూడా నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి ప్రశ్నలు కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఉంటే,అది రిజర్వేషన్లోనా,ఎన్ని సార్లు ఎన్నికయ్యారో వంటి వివరాలు అడుగుతారు. వార్డు సభ్యుల నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు అన్ని స్థాయిలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు.
సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
సమాజంలోని వివిధ వర్గాల అభివృద్ధికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి సమాజంలో మరింత మెరుగైన అవకాశాలను అందించేందుకు, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించబడనుంది. ఈ సర్వేలో ప్రణాళికశాఖ నోడల్ విభాగంగా పనిచేస్తుంది. ఈ సర్వే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టబడనుంది. జిల్లా, మండల నోడల్ అధికారులు ఎన్యూమరేషన్ బ్లాక్‌ల గుర్తింపు, గణకుల నియామకం, ఇళ్ల జాబితా తయారీ, డేటా ఎంట్రీ,అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు బాధ్యత వహిస్తారు.
సర్వేలో సుమారు 80,000 మంది ఉద్యోగులు
సెన్సెస్ డైరెక్టరేట్ నుంచి ఈబీ మ్యాపులను పొందడం,లేనిప్రాంతాల్లో కొత్త మ్యాపులను రూపొందించడం జరుగుతుంది. సర్వేలో సుమారు 80,000 మంది ఉద్యోగులు పాల్గొనబోతున్నారు, ఇందులో 48,229 మంది విద్యాశాఖ ఉద్యోగులుగా ఉంటారు. ఉపాధ్యాయులతో పాటు, ఇతర కేటగిరీల ఉద్యోగులను కూడా సర్వేకు ఉపయోగించనున్నారు. సర్వే సమయంలో ఇళ్లను ఈబీలుగా విభజించనున్నారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే, వాటిని ఒకే ఈబీగా నిర్ణయించి, ఒక గణకుడికి అప్పగిస్తారు. కుటుంబాల సంఖ్య 175 కంటే ఎక్కువ అయితే, వాటిని చిన్న యూనిట్లుగా విభజించి, ప్రతి ఈబీలో కనీసం 150 ఇళ్లు ఉండేలా గణకులను నియమించాలి. ప్రభుత్వం ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇంటిగోడపై స్టిక్కర్
సర్వే సమయంలో, గణకులు కుటుంబ సభ్యుల సంఖ్య వంటి స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలి. ప్రతి ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి నంబరు, యజమాని పేరు వంటి వివరాలను సర్వే ఫారంలో నమోదు చేయాలి. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ని అతికించాలి. సర్వే అనంతరం,ఫారాల్లో నమోదు చేసిన వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం కీలకమైనది. డేటా ఎంట్రీ సమర్థంగా నిర్వహిస్తే, విశ్లేషణ కచ్చితత్వం సాధించగలిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ప్రణాళికశాఖ జిల్లా, మండలాల్లో అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ పూర్తిచేసింది. ప్రతి రోజూ గణకులు సేకరించిన వివరాలను నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆపరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను సూపర్‌వైజర్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
సమాచార గోప్యత
సర్వే నిర్వహణలో కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం గోప్యతగా ఉంచాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయాన్ని గణకులు ముందుగానే యజమానికి వివరించాలి. ఎక్కడా ఈ సమాచారం బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసేందుకు హామీ ఇస్తారు. ఫారంలోని వివరాలను నింపిన తర్వాత, వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. గణకులు వివరాలను డేటా ఎంట్రీ కేంద్రంలోని ఆపరేటర్‌కు అందించేందుకు తీసుకెళ్లాలి. ఆ సమయంలో కూడా ఫారాలను గోప్యంగా ఉంచడంతో పాటు, ఆ డేటాను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి రోజూ నిర్వహించిన సర్వే వివరాలను మరియు పురోగతిని సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికశాఖకు పంపాల్సిన బాధ్యత ఉంది.