Sanjay Raut: 'గడ్చిరోలి అభివృద్ధి మహారాష్ట్రకు మేలు'.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది.
ఒకవైపు విభజనకు గురైన శరద్ పవార్ కుటుంబం మళ్లీ ఒకటవ్వడానికి అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్) పార్టీ కీలక నాయకుడు సంజయ్ రౌత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవీస్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని రౌత్ వ్యాఖ్యానించారు.
శుక్రవారం (జనవరి 3) ఆయన మీడియాతో మాట్లాడుతూ, "గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం, మా సంబంధాలు కొనసాగుతాయి. గడ్చిరోలి వంటి మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తీసుకుంటున్న చర్యలు శ్లాఘనీయమైనవి" అని అన్నారు.
వివరాలు
ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం
ఇటీవలి కాలంలో, కోట్ల రూపాయల రివార్డులు ఉన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన సందర్భం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
అదే సమయంలో, గత నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్) ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా, బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మహాయుతి కూటమిగా కలిసి బరిలోకి దిగింది.
ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే, ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్) పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం.