
SC classification: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు శుభారంభం.. జీవో తొలి కాపీని సీఎం రేవంత్‌కు ఇవ్వనున్న ఉపసంఘం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సోమవారం నుంచి అమలు చేయనున్నారు.
ఈ వర్గీకరణ కోసం సుమారు 30 ఏళ్లుగా జరిగిన నిరంతర పోరాటానికి ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణానికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజునే ఈ వర్గీకరణ అమలుకు ప్రారంభదినంగా నిర్ణయించడంతో, అదే రోజున ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశం ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించబడింది.
ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
వివరాలు
2026 జనాభా లెక్కల తర్వాత రిజర్వేషన్లలో మార్పులు
ఉపసభ్యులుగా మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, అలాగే ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, శాఖ డైరెక్టర్ క్షితిజ్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల తొలి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ,2026లో కొత్త జనాభా లెక్కలు వచ్చిన అనంతరం ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని,కానీ తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం 17.5కి పెరిగిందని పేర్కొన్నారు.
వివరాలు
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక - 199 పేజీలతో వివరణ
తగిన డేటా వచ్చిన తరువాత దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే, ఎస్సీ వర్గీకరణలో 'క్రీమీలేయర్' ప్రవేశపెట్టాలన్న సిఫారసును ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించిందని పేర్కొన్నారు.
వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వం ముందు ఉంచింది.
ఇందులో 59 ఎస్సీ కులాల గురించి విస్తృతమైన విశ్లేషణను చేసింది. ఈ కమిషన్ 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించి 82 రోజుల వ్యవధిలో నివేదికను పూర్తి చేసింది.
బహిరంగ విచారణలు, పర్యటనల ద్వారా ప్రజల నుండి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు ఆఫ్లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో వచ్చిన మొత్తం 8,681 వినతులను సమగ్రంగా పరిశీలించింది. అనంతరం 59 కులాలను మూడవర్గాలుగా విభజించింది:
వివరాలు
ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
గ్రూప్-1: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ పక్షాలపై అత్యంత వెనుకబడిన కులాలు
గ్రూప్-2: మధ్యస్థంగా లాభపడిన కులాలు
గ్రూప్-3: ఇతర కంటే మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, ''రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను అమలులోకి తెచ్చింది. గత ప్రభుత్వాలు ఈ విషయంలో తీర్మానాలు చేసినా, చట్టపరమైన విధానంతో ముందుకు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మద్దతుతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వర్గీకరణను విజయవంతంగా అమలు చేయనుంది'' అని అన్నారు.
వివరాలు
శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం
మార్చి 18న శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించింది.అనంతరం గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపారు.
సోమవారం వర్గీకరణ ఉత్తర్వులు,విధివిధానాలు అధికారికంగా విడుదల కానున్నాయి.
మొదటి జీవో ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించిన మార్గదర్శకాలను సమీక్షించి ప్రభుత్వం జీవోకు ఆమోదం తెలిపింది.
గతసంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అక్టోబరులో ఈకమిషన్‌ను ఏర్పాటు చేశారు.
కమిషన్ జనాభా గణాంకాలు,అక్షరాస్యత,ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి,ఉద్యోగం,ఆర్థిక సాయం, రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేసింది.
ప్రాథమికనివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే కమిషన్ పదవీకాలాన్ని నెలరోజులు పొడిగించి,తుదినివేదికను సమర్పించుకునేలా చేసింది.