
Colonel Sofiya Qureshi: కర్నల్ సోఫియాపై వ్యాఖ్యల వివాదం.. మంత్రిపై సుప్రీం ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్తాన్తో జరిగిన పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు అందించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా చేరింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మంత్రి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను రేపు విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతేకాకుండా కోర్టు ఆయన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ''వెళ్లి క్షమాపణ చెప్పండి. మీరు మరింత సున్నితంగా వ్యవహరించాలి'' అని మండిపడింది.
వివరాలు
పోలీసులు విజయ్ షాపై కేసు నమోదు
'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి సమాచారాన్ని మీడియాతో పంచుకున్న కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆమెను 'ఉగ్రవాదుల సోదరి'గా అభివర్ణించిన ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హైకోర్టు సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకుని విచారణ ప్రారంభించింది. శత్రుత్వం, విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కూడా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు విజయ్ షాపై కేసు నమోదు చేశారు.
వివరాలు
విజయ్ షా 'మూర్ఖుడు'
ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ... దేశంలో సమగ్రత, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థ సేవ, గౌరవం, అజేయ ధైర్యంతో నిండిన ఏకైక సంస్థ భారత సైన్యమేనని స్పష్టం చేశారు. ఇక జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత పదవిలో ఉన్న మహిళపై ఇలాంటి విమర్శలు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా స్పందించారు. మంత్రి విజయ్ షాను 'మూర్ఖుడు'గా సంబోధిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి, ఇంత పెద్ద వివాదం జరిగినప్పటికీ ఇప్పటివరకు మంత్రి విజయ్ షాపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.