
Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత సైనికాధికారి కల్నల్ సోఫియా చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం మంత్రి విజయ్ షాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసులో విజయ్ షా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ మాట్లాడుతూ, ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్టు కోర్టులో వాదనలు వినిపించారు.
అయితే, సుప్రీంకోర్టు వెంటనే ఆదేశిస్తూ, ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారించాలన్న తీర్పు ఇచ్చింది.
వివరాలు
విజయ్ షా అరెస్టును నిలిపివేస్తూ.. సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే ఆదేశాలు జారీ
ఈ SIT బృందాన్ని మధ్యప్రదేశ్ DGP మంగళవారం రాత్రి 10 గంటలలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ బృందంలో ఎంపీ కేడర్‌కు చెందని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని స్పష్టంగా పేర్కొంది.
వారిలో ఒకరు తప్పనిసరిగా మహిళా అధికారి కావాలి. ఈ ప్రత్యేక బృందానికి ఐజీపీ స్థాయి అధికారి నాయకత్వం వహించాలి. మిగిలిన ఇద్దరు సభ్యులు ఎస్పీ స్థాయికి పై స్థాయిలో ఉండాలి.
అలాగే దర్యాప్తులో పిటిషనర్ పూర్తిగా సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, ప్రస్తుతం విజయ్ షా అరెస్టును నిలిపివేస్తూ సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
మీరు చెప్పిన క్షమాపణ ఎక్కడ ఉంది?
కానీ దీనికి ముందు,విజయ్ షా తరఫున వాదించిన న్యాయవాది మణీందర్ సింగ్, ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారు అని కోర్టుకు తెలియజేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, "మీరు చెప్పిన క్షమాపణ ఎక్కడ ఉంది?" అని ప్రశ్నించారు.
"ఈ అంశం తీవ్రతను పరిగణలోకి తీసుకుంటే,మీరు ఏ రకమైన క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు? అది నిజమైనదేనా లేక మొసలి కన్నీళ్లేనా? మాకు మీ క్షమాపణ అవసరం లేదు. మేము ఈ వ్యవహారాన్ని చట్టబద్ధంగా పరిష్కరిస్తాం. మళ్లీ మీరు క్షమాపణ చెబితే, దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం" అని హెచ్చరించారు.
వివరాలు
జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు
"మీరు ఒక ప్రజా ప్రతినిధి, ఒక రాజకీయ నాయకుడు.మీరు చేసిన వ్యాఖ్యలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.ఇప్పుడు వాటిని ఎలా ఆపతారు? ఇది చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. మన భారత సైన్యం గురించి మేము గర్వంగా భావిస్తున్నాం" అని జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.