Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంపై లోక్‌సభలో విచారణ జరపాలని కోరారు.
లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో దిల్లీ లిక్కర్ స్కాంను మించిన భారీ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
Details
ఏపీ లిక్కర్ స్కాం - 10 రెట్లు అధికం?
లోక్‌సభలో సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చారని, ప్రైవేట్ దుకాణాలను తొలగించి, ప్రభుత్వ దుకాణాల ద్వారానే అమ్మకాలు జరిపినట్లు వివరించారు.
ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని, ఇవన్నీ నగదు రూపంలోనే లావాదేవీ అయినట్లు చెప్పారు.
అంతేగాక ప్రైవేట్ ఉద్యోగులను నియమించకుండా, కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉద్యోగులను నియమించారని, అవి పూర్తి పారదర్శకంగా లేవని ఆరోపించారు.
రూ.2,500 కోట్ల దిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే ఏపీలో జరిగిన కుంభకోణం 10 రెట్లు అధికమని, ఇది జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అంశమని పేర్కొన్నారు.
Details
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్
సీఎం రమేశ్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం రమేశ్ బీజేపీ కోసం కాదు, తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందేందుకే ఆయన ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
సీఎం రమేశ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. తాను మార్గదర్శి స్కామ్ గురించి మాట్లాడినందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.
మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని, దానిపై కూడా సమగ్ర దర్యాప్తు అవసరమని తెలిపారు. ఈ అంశాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!