ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో !
ఏపీలో వచ్చే సోమనారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ లెక్కన జూన్ 12న స్కూళ్లు రీ ఓపెన్ అవనున్నాయి. ఈ నేపథ్యంలో 2023-24 క్యాలెండర్ ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈసారి 229 రోజులు పనిదినాలున్నాయన్న పాఠశాల శాఖ, మొత్తం 88 సెలవులు ఉన్నాయని ఇప్పటికే ప్రకటించింది. 1. ప్రాథమిక పాఠశాలలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. 2. ఉన్నత పాఠశాలలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 3. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటి పూట బడులను ఫిక్స్ చేశారు.
నో బ్యాగ్ డే అమలు
మొదటి , రెండో తరగతి తరగతుల వారికి సైతం మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ వివరించింది. ఆయా యూనిట్లు సిలబస్ నుంచి తొలగింపు : పలు తరగతుల వారి సబ్జెక్టుల్లో కొంత సిలబస్ తొలగింపునకు గురైంది. తొమ్మిదో తరగతి వారికి తెలుగు సబ్జెక్టులో చైతన్యం, మాట మహిమ, ప్రియమైన నాన్నకు, నా చదువు పాఠాలను తొలగించారు. అలాగే పదో తరగతిలోని ధన్యుడు, సముద్ర లంఘనం తొలగించేశారు..
ఈ ఏడాది పండగ సెలవుల వివరాలు
పండగ సెలవులు : దసరా : అక్టోబరు 14 నుంచి 24 వరకు దీపావళి : నవంబరు 12న క్రిస్మస్ : డిసెంబరు 25న సంక్రాంతి సెలవులు 2024 జనవరి 9 నుంచి 18 వరకు ఇచ్చినట్టు క్యాలండర్ ద్వారా ప్రకటించారు. క్రిస్టియన్ మైనారిటీ సంస్థల సెలవులు : దసరా సెలవులు : అక్టోబరు 21 నుంచి 24 వరకు క్రిస్మస్ సెలవులు : డిసెంబరు 17 నుంచి 26 వరకు సంక్రాంతి సెలవులు : జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తున్నట్టు వెల్లడించారు. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 23-29 వరకు, అలాగే ఏప్రిల్ 11 నుంచి 20 వరకు సమ్మేటివ్-2, సీబీఏ-3 ఎగ్జామ్స్ లను నిర్వహిస్తారు.
ఫెయిలైన విద్యార్థులు మళ్లీ అవకాశం : విద్యాశాఖ
10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ తో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఫెయిలైతే, మళ్లీ చదువుకునేందుకు అవకాశమిస్తున్నామని అధికారులు అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా స్టూడెంట్స్ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకోవచ్చని సూచించారు. ఒకవైపు సప్లిమెంటరీలో పాసైతే కంపార్ట్‌మెంటల్ అని అంటారు. కానీ రెగ్యులర్ ఉత్తీర్ణులుగా పరిగణించాలంటే మాత్రం మళ్లీ బడికి వెళ్లి అన్ని సబ్జెక్టులు చదివాల్సిందేనన్నారు. మరోవైపు పాఠశాల పునఃప్రారంభమయ్యే రోజునే ఆంధ్రప్రదేశ్ సర్కారు విద్యాకానుకను అందించనుంది.