గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఆదివారం మరణించారు. నాయడు స్వగ్రామం మెంటాడ మండలంలోని చల్లపేట. గత కొంతకాలంగా గజపతినగరంలో ఉంటున్న సన్యాసినాయుడు, వారం కిందట ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. దీంతో 90 ఏళ్ల వయస్సులో సన్యాసినాయుడు గాయాల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు సన్యాసినాయుడు మృతి పట్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఈ మేరకు సోమవారం స్వగ్రామం చల్లపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అభిమానుల సందర్శనార్థం అంతిమ సంస్కారాలు చేపట్టనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ గెలుపునకు ప్రచారం
విజయనగరం ఎమ్మార్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన సన్యాసినాయుడుకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలినాళ్లలో 1959లో సోషలిస్టు పార్టీ నుంచి, 1962లో నీలం సంజీవరెడ్డి హయాంలో కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేసిన సన్యాసినాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి నాయుడు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే 2005 వరకు పార్టీలోనే క్రియాశీలంగా ఉన్న సన్యాసి, అనంతరం వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే వారసత్వంగా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పెద్ద కుమారుడు తాడ్డి వెంకట్రావు 1999లో గజపతినగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.