Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, విలేకర్లతో మాట్లాడారు. 2023లో ప్రారంభమైన పెండింగ్ పనులు 2024 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరొక టెర్మినల్ భవనం నిర్మాణం జరుగుతుందని, విమానాశ్రయం అభివృద్ధితో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. దిల్లీకి సర్వీసు త్వరలో ప్రారంభం అవ్వొచ్చని పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్ బిడ్‌లో భారత్ ఉండటం గర్వకారణం
అదే రోజు, రాజమహేంద్రవరంలో సౌత్‌జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ క్రీడకు ఉన్న ఆదరణను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2000లో పుల్లెల గోపిచంద్‌కు హైదరాబాద్‌లో 10 ఎకరాల భూమిని బ్యాడ్మింటన్ అకాడమీకి కేటాయించారని, అమరావతిలో కూడా 15 ఎకరాల భూమి కేటాయించినట్లు గుర్తుచేశారు. అయితే, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అకాడమీ పనులు సాగలేదన్నారు. 2027-28లో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు భారతదేశం బిడ్‌లో ఉండటం దేశం కోసం గర్వకారణమని తెలిపారు.