తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తిరవళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తిరుపత్తూరు, తిరువణ్ణామలైలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సహా రాష్ట్రాల్లో మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది.
చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
తమిళనాడులోని చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. నదులు, సరస్సుల్లో నీటిమట్టాలు పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఒడిశాలో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని, దేశంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని వివరించింది.