ఎమర్జెన్సీ అలెర్ట్ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే
ఎమర్జెన్సీ అలెర్టులు ఫోన్లను హోరెత్తిస్తున్నాయి. భారతదేశంలోని చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ వచ్చింది. తీవ్ర పరిస్థితి(SEVERE SITUATION) అన్న అర్థం వచ్చే రీతిలో ఆ ఫ్లాష్ మెసేజ్ మొబైళ్లను ముంచెత్తింది. ఈ మేరకు ఆ ఎక్కడి నుంచి వచ్చిందో, దేనికి వచ్చిందో తెలియక వినియోగదారులు బెంబెలిత్తిపోతున్నారు. అది ఇదేదో మాల్ వేర్ కావొచ్చని, సైబర్ నేరగాళ్ల పనే అయ్యింటుందని ఇంకొందరు వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగానే ఈ సందేశం పంపించామని పేర్కొంది.
విపత్తు సమయంలో ప్రజలకు అత్యవసర సందేశం కోసమే ఈ మెసేజ్
అత్యవసర మేసేజ్ తో కూడిన ఓ ఫ్లాష్ మెసేజ్ మీ ఫోన్‌కు ఎందుకు పంపారంటే, భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు లాంటి భారీ విపత్తులు తలెత్తినప్పుడు ఇలాంటి సందేశాలతోనే అప్రమత్తం చేస్తారు. ప్రజలకు అత్యవసర సందేశాలను పంపేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ ను రూపొందించింది. ఇందులో భాగంగా గురువారం దీన్ని కేంద్రం పరీక్షించింది. అందువల్లే ఉదయం 11.41 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలోని వినియోగదారులకు పెద్ద బీప్ సౌండ్‌తో ఈ ఫ్లాష్ వచ్చింది. ఇంగ్లీష్, హిందీ సహా భారతీయ ప్రాంతీయ భాషల్లో ఈ అలెర్ట్‌ను పంపించారు. సందేశంతో పాటు ఆడియోలోనూ వినబడటంతో యూజర్లు ఆందోళన చెందారు.
పాన్ ఇండియా రేంజ్ లో ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ చెకింగ్
అఖిల ఇండియా స్థాయిలో(PAN INDIA RANGE) ఎమర్జెన్సీ అలెర్ట్ వ్యవస్థను పరీక్షించేందుకే ఈ మెసేజ్ పంపించాని అందులో రాసి ఉంది. ప్రజలకు, విపరీత పరిస్థితుల్లో ముందస్తు హెచ్చరికలు పంపేందుకు ఈ సాంకేతికత ఉపయోగకరం. ప్రజా భద్రతను మెరుగుపరుస్తుందని సందేశం ద్వారా తెలుస్తోంది. ఈ మెసేజ్ కింద ఉన్న 'ఓకే' ఆప్షన్ క్లిక్ చేశాక, మరో మెసేజ్ కనిపించింది. ఈ మేరకు మీకు వైర్‌లెస్ ఎమర్జెన్సీ సందేశం వచ్చిందని, భవిష్యత్ లో అత్యవసర సందేశాలను పొందేందుకు ఆప్షన్‌ను ఎంచుకోండని రాసి పంపించారు. సెల్ టవర్ ఆపరేటర్లు,బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను పరిశీలించేందుకే ఈ ప్రయోగం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ గతంలోనే స్పష్టం చేసింది.