Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఈరోజు (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇదే సమయంలో, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను మరోసారి ముఖ్యమంత్రిగా నియమించకపోవడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షిండే పాలన శకం ముగిసిందని, ఇక ఆయన మహారాష్ట్రకు సీఎం కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ షిండేను ఒక పావులా వాడుకుని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు.
పాలక కూటమిలో చీలిక మొదలైంది: సంజయ్
సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "షిండే శకం ముగిసింది. ఆయన రెండు సంవత్సరాలు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేశారు. ఇక నుంచి షిండే మహారాష్ట్రకు సీఎం కాలేడు. బీజేపీ తన వ్యూహాన్ని ఉపయోగించి తమతో కలసి పనిచేసే పార్టీలను బలహీనపరుస్తోంది, విచ్ఛిన్నం చేస్తోంది" అని అన్నారు. షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేసే అవకాశముందని,బీజేపీ వ్యూహం ఇదేనని రౌత్ మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు పట్టిందని, ఇది వారి పాలక కూటమిలో ఉన్న లోపాలను వెల్లడిస్తోందని అన్నారు. "పాలక కూటమిలో చీలిక మొదలైందని,రేపటి నుంచి ఈ సమస్య మరింత పెద్దదవుతుంది.ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా వారు కలిసి పని చేస్తున్నారు"అని ఆయన విమర్శించారు.
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్
అయితే బుధవారం ముంబయిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇది ఆయన మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ఫడ్నవీస్ ప్రకటించారు. ఇందులో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎంగా కొనసాగుతామని వెల్లడించారు. అదేవిధంగా, షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారనే వార్తలున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.