Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ వివరాలు ఆంగ్ల మీడియా కథనాల ద్వారా వెలుగు చూశాయి.
డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈసారి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. బుధవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకోనున్నారు. సీఎం పదవి, శాఖల కేటాయింపుల విషయంలో మహాయుతి కూటమి మధ్య కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. శిందే హోంశాఖను కోరుతూ, ఉప ముఖ్యమంత్రి పదవిని వద్దని పేర్కొన్నారని వార్తలు వెలువడ్డాయి.
షిండే ఆరోగ్యం పై అప్రమత్తత
దీనిపై పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పరిశీలకులుగా నియమితులయ్యారు. మరోవైపు, ఎన్డీయే నేత రామ్‌దాస్ అథవాలే శిందేతో సమావేశమై, ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించమని సూచించినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం షిండే తన వైఖరిని మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిందే జ్వరం, గొంతునొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆయన మంగళవారం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది. ఠాణెలో ఓ ఆసుపత్రిలో శిందే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు మరింత చికిత్స అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే సూచనలుగా కనిపిస్తున్నాయి.