Maharashtra : ఉద్ధవ్ శివసేనకు షాక్.. 23 సీట్ల డిమాండ్'ను తిరస్కరించిన కాంగ్రెస్
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. అయితే తమకు 23 లోక్‌సభ సీట్లు కావాలని పట్టుబట్టిన మిత్రపక్షం శివసేన(యుబిటి) డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడి భాగస్వాములైన శివసేన(యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు పార్టీల నేతలు సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను శివసేన తన ఖాతాలో వేసుకుంది.అయితే శివసేన రెండుగా విడిపోవడంతో ఏక్‌నాథ్ షిండే వైపే ఎక్కువమంది నేతలు మొగ్గు చూపారు. మరోవైపు పార్టీ విభజనతో తగినంత మంది ఎంపీ అభ్యర్థులు కూడా యూబీటీకి లేకపోవడంతో శివసేన ఉద్ధవ్ వర్గం సవాల్ ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ అభిప్రాయపడ్డారు.
విభేదాలు మానుకోవాలన్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్
శివసేన, శరద్‌పవార్‌ల ఎన్‌సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో పాత పార్టీ ఒక్కటే స్థిరమైన ఓట్ బ్యాంకుతో కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశంలో స్పష్టం చేశారు. పార్టీల మధ్య సర్దుబాట్లు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లలో ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ పెట్టడం ఎక్కువగా ఉందన్నారు. సీట్ల పంపకాల్లో మిత్రపక్ష నాయకులు విభేదాలు మానుకోవాలని సంజయ్ నిరుపమ్ సూచించారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు కానీ వాటిని ఏం చేస్తారు, సంక్షోభం తెచ్చిపెట్టిన శివసేన నేతలు వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలోనే శివసేనకు అభ్యర్థుల కొరత సమస్య ఉందన్నారు.