Page Loader
Pakistani celebrities: పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. సోషల్‌ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం
పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. సోషల్‌ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం

Pakistani celebrities: పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. సోషల్‌ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మరోసారి నిషేధం పడింది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ అకౌంట్లను తాత్కాలికంగా నిలిపివేయగా, బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేయడంతో ఆ ఖాతాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఫలితంగా పాక్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల యూట్యూబ్ ఛానళ్లు మళ్లీ కనిపించాయి. అంతేకాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వారి పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పరిణామంపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖాతాలపై నిషేధాన్ని కొనసాగించాలని సోషల మీడియాలో వాడివేడి డిమాండ్లు వినిపించాయి. దీంతో, పాకిస్థాన్‌కి చెందిన సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో మరోసారి బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం నుంచి ఈ ఖాతాలు తిరిగి నిలిపివేయబడ్డాయని సమాచారం.

వివరాలు 

యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమ ఖాతాలపై భారత్ ప్రభుత్వం నిషేధం

అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో, పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమ ఖాతాలపై భారత్ ప్రభుత్వం నిషేధం విధించింది. పాక్ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా సంస్థలకు చెందిన అనేక ఛానళ్లపై ఈ చర్యలు తీసుకున్నాయి. అందులో షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది వంటి పాక్ మాజీ క్రికెటర్ల యూట్యూబ్ ఛానళ్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, పాక్ రక్షణ మంత్రికి సంబంధించిన ఖాతా, ఆ దేశ ప్రధానమంత్రి యూట్యూబ్ ఛానల్‌ను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం

పాక్‌కి చెందిన క్రికెటర్లు, నటీనటులు, క్రీడాకారుల ఖాతాలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. ఈ ఛానళ్ల ద్వారా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అటువంటి ఛానళ్లకు లేదా ఖాతాలకు భారత్‌లో యాక్సెస్ ఇచ్చే ప్రయత్నం చేసినపుడు, "ఈ కంటెంట్ భారత ప్రభుత్వం జాతీయ భద్రత కారణాల దృష్ట్యా నిరోధించిందని" స్పష్టమైన సందేశం వినియోగదారులకు కనిపించేది.