Page Loader
LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం
వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం

LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలును మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ అధికారులు కుమ్మక్కై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తుండటంపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయించింది. ఈ నేపథ్యంలో మొత్తం పెండింగ్‌ దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించేందుకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Details

25శాతం రాయితీ

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖల ముఖ్య కార్యదర్శులు నవీన్‌మిత్తల్, దానకిశోర్, జ్యోతి బుద్ధప్రకాశ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తం నుంచి 25శాతం రాయితీ కల్పించి ఓటీఎస్‌ విధానం అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎఫ్‌టిఎల్‌ పరిధిలో ఉన్న లేఔట్లను మినహాయించి మిగిలిన వాటికి మాత్రమే ఓటీఎస్‌ వర్తించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు.

Details

పెండింగ్‌ దరఖాస్తులు, అక్రమ రిజిస్ట్రేషన్ల సమస్య 

2020 ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు ప్రారంభించినప్పటి నుండి దాని అమలుపై అనేక చర్చలు జరిగాయి. అప్పట్లో 25 లక్షల దరఖాస్తులు అందగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుతం 7-8 లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు పరిష్కారం కాకముందే అక్రమ లేఔట్లు వేశారని, వాటిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని గుర్తించారు. మరికొన్ని చోట్ల మున్సిపల్‌ అధికారులు అక్రమ లేఔట్లకు ఇంటి నంబర్లు మంజూరు చేసి రిజిస్ట్రేషన్‌కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

Details

అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 

అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2020 నుంచి 132 మంది రిజిస్ట్రార్లు సస్పెండ్‌ అయ్యారు. అందులో 92 మంది ఎల్‌ఆర్‌ఎస్‌. అక్రమాలకు సంబంధించినవారే కావడం గమనార్హం. అనధికార లేఔట్లలో రిజిస్ట్రేషన్‌ సాధ్యమయ్యేలా కొందరు అధికారులను బెదిరించి సెలవుపై వెళ్లేలా చేసి, క్లర్క్‌లను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ఘటనలు కూడా జరిగినట్లు గుర్తించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా తగినంత ఆదాయం రాకపోగా, అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా ప్రభుత్వం నష్టపోయిందని నిర్ధారణకు రావడంతోనే ఓటీఎస్‌ విధానాన్ని తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విధానం ద్వారా పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించడం మాత్రమే కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లను పూర్తిగా అరికట్టే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.