Page Loader
Kerala: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం .. అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం

Kerala: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం .. అనేక ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రం అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, భారత వాతావరణ విభాగం గురువారం రోజు పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాబోయే కొన్ని రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

వివరాలు 

పంటలపై కూడా తీవ్ర ప్రభావం

ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. బలమైన గాలులు, వర్షాల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తీవ్రగాలులతో కలసి కురిసిన వర్షాల కారణంగా పలు చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా అనేక ఇళ్లకు నష్టం వాటిల్లింది. పంటలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వయనాడ్‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల ప్రజలు భద్రత కోసం సహాయ కేంద్రాల్లోకి తరలివచ్చారు.

వివరాలు 

ఎక్కువ వర్షం కురిసే అవకాశం

వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల వివరాల్లోకి వెళితే.. రెడ్‌ అలర్ట్‌ అంటే 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్‌ అలర్ట్‌ పరిధిలో 11 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉండొచ్చని అంచనా. ఇక ఎల్లో అలర్ట్‌ కింద 6 నుండి 11 సెంటీమీటర్ల మధ్య వర్షాలు కురిసే అవకాశముంటుంది.