
Banana Farming: భూతాపంతో అరటి పంట ఉనికికే ప్రమాదం.. కోరలుచాస్తున్న వాయు, జల కాలుష్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
అరటి పండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి.
ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండే పండు. ఒక్కోసారి రూ.100 పెట్టినా భోజనం దొరకని పరిస్థితుల్లో, కనీసం రూ.10తో రెండు అరటిపండ్లు కొనగలుగుతాం.
ఇవి తిన్న వెంటనే శరీరానికి శక్తిని అందిస్తాయి. ఈ పండులో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ట్రిప్టోఫాన్, విటమిన్ బీ6లు మన మనోవైకల్యాలను సమతుల్యంగా ఉంచుతాయి.
వివరాలు
2050 నాటికి అరటి దిగుబడి తగ్గే ప్రమాదం
అరటిపండ్లు కేవలం ఆహారంగానే కాకుండా, వివిధ పరిశ్రమలలోనూ ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, వీటిని వైన్ తయారీలో వాడతారు. అలాగే అరటి చెట్ల తాడలను బ్యాగులు, తాళ్లు, కాగితాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
ఇటువంటి ఎంతో విలువైన పంటను మనం మన చేతులాతోనే నాశనం చేసుకుంటున్నాం.
ఈ పరిస్థితిని నివారించకపోతే 2050 నాటికి భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరటి దిగుబడి తీవ్రంగా తగ్గే ప్రమాదం ఉందని యూకేకు చెందిన "క్రిస్టియన్ ఎయిడ్" సంస్థ తాజా నివేదికలో హెచ్చరించింది.
వివరాలు
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఎందుకు?
ఈ సంస్థ భారత్, కోస్టారికా, గ్వాటెమాలా, టాంజానియా దేశాల్లో చేపట్టిన అధ్యయనంలో... అడవుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల వంటి అంశాలు అరటి పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
అదనంగా, రసాయనిక పురుగుమందుల విపరీత వాడకంతో నేలల జీవన శక్తి క్షీణించి దిగుబడిలో తీవ్ర తగ్గుదల కనిపిస్తోంది.
సాధారణంగా 15-35 డిగ్రీల ఉష్ణోగ్రతలో,75-85 శాతం తేమ ఉన్న ప్రదేశాల్లో అరటి మంచి దిగుబడిని ఇస్తుంది.
అయితే ఉష్ణోగ్రత 12డిగ్రీల కంటే తక్కువగా ఉంటే, లేదా 80 కి.మీ. వేగంతో గాలులు వీచినప్పుడు అరటి మొక్కలు నేలకొరిగే ప్రమాదం ఉంది.
అదే విధంగా, ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటితే పంట ఎదుగుదల ఆగిపోతుంది. 47 డిగ్రీలు దాటితే అరటి మొక్క పూర్తిగా నశిస్తుంది.
వివరాలు
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఎందుకు?
భారత్‌లో 1950తర్వాత వాతావరణంలో భారీ మార్పులు సంభవించాయి.
తీవ్రమైన వర్షపాతం సంఘటనలు మూడింతలు పెరగ్గా,వార్షిక వర్షపాతం మొత్తం మాత్రం తగ్గింది.
రుతుపవనాల రాక ఆలస్యం కావడం,అకాల వర్షాలు,వరదలు ఎక్కువవ్వడం,నేలలు ఎరువుల కొరతతో కోతకు గురవ్వడం వంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వీటికి తోడు అరటి పంటపై శిలీంధ్ర వ్యాధుల ప్రభావం తీవ్రమవుతోంది.
ముఖ్యంగా పనామా వ్యాధి,బ్లాక్ లీఫ్ ఫంగస్ వంటి వ్యాధులు భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, కొలంబియా, పెరూ, వెనుజువెలా దేశాల్లో పంటను నాశనం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో 2024లో ప్రపంచ అరటిపండ్ల ఉత్పత్తిలో కేవలం 20 శాతం మాత్రమే ఎగుమతికి వెళ్లినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అరటిపండు ఉత్పత్తి పడిపోతే, ప్రజల ఆహార భద్రత, ఆరోగ్యం, రైతుల ఆదాయం అన్నీ దెబ్బతింటాయి.
వివరాలు
భారత్ - అరటి ఉత్పత్తిలో అగ్రగామి
గోధుమ,వరి,మొక్కజొన్న తర్వాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆహార పంటగా అరటిపండు గుర్తింపు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 40కోట్ల మంది ప్రజలు తమ రోజువారీ కేలరీలలో 15-27 శాతం వరకు అరటిపండ్లపైనే ఆధారపడుతున్నారు.
ఇది కేవలం ఆహార పంటగా కాక,ఆదాయ వనరుగా కూడా సేవలందిస్తోంది.
అరటి పండ్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఎగుమతుల్లో మాత్రం 12వ స్థానంలో ఉంది. దీని ప్రధాన కారణం దేశీయ వినియోగం ఎక్కువగా ఉండటమే.
దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణంలో అరటి పంట 20 శాతం స్థలాన్ని ఆక్రమించి ఉంది.
ముఖ్యంగా తమిళనాడు,ఆంధ్రప్రదేశ్‌ల్లో అధికంగా పండిస్తున్నారు.
దేశంలో 20కి పైగా రకాల అరటిపండ్లను పండిస్తున్నారు. కానీ భూతాపం పెరుగుదల వల్ల సాగుపై దుష్ప్రభావం పడుతోంది.
వివరాలు
పరిష్కార మార్గాలు - మన చేతుల్లోనే
ప్రభుత్వాల పాత్ర:
హానికారక ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
కాలుష్యరహిత పరిశ్రమలను ప్రోత్సహించాలి.
సౌరశక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి.
వాతావరణ మార్పులకు తట్టుకునే అరటి వంగడాలపై పరిశోధనలను వేగవంతం చేయాలి.
రైతులకు ఆర్థిక సాయం అందించాలి.
అడవుల నరికివేతను నియంత్రించాలి.
రైతుల పాత్ర:
సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించాలి.
బిందుసేద్యం వంటి నీటి సంరక్షణ పద్ధతులను వినియోగించాలి.
పురుగుమందుల వినియోగాన్ని శాస్త్రవేత్తల సూచనల మేరకు పరిమితం చేయాలి.
వివరాలు
ప్రజల బాధ్యత:
శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి.
విద్యుత్ వినియోగాన్ని తగ్గించే మార్గాలు అవలంబించాలి.
ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి.
ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి.
మొక్కలను విరివిగా నాటాలి.
ఇలా ప్రతి ఒక్కరం, మక్కువతో చొరవ తీసుకుంటే అరటిపంట మనుగడను కాపాడగలం.
మన ఆరోగ్యాన్ని, రైతుల భవిష్యత్తును, ప్రకృతిని కాపాడడంలో భాగస్వాములవ్వగలం.