AP: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు సూపర్ ఛాన్స్.. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
నగరాలు, పట్టణాల్లో ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్ సేవలు అందుబాటులో ఉన్నా, వీటిని నడిపేవారు ఎక్కువగా పురుషులే కావడంతో మహిళలు ప్రయాణించేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా, రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో త్వరలో మహిళా రైడర్లు రోడ్లపైకి రానున్నారు.
స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు సమకూర్చనుంది. వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించేందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరింది.
Details
మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
ఈ నిర్ణయంతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రణాళిక కింద విశాఖపట్నం, విజయవాడలో 400 చొప్పున ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు కేటాయించనున్నారు.
అదనంగా రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో మరో 200 వాహనాలను అందజేస్తారు.
ముద్ర, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సభ్యులకు రుణాలు అందించి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు.
ర్యాపిడో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వాహనాలు నడిపే మహిళా రైడర్లు మొదటి మూడు నెలల పాటు ప్లాట్‌ఫాం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఆ తర్వాత నెలకు రూ. 1,000 చొప్పున చెల్లించాలి. ఒక్కో వాహనానికి నెలకు 300 బుకింగ్‌లు ర్యాపిడో సంస్థ ఇవ్వనుందని సమాచారం.