Page Loader
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం అసహనం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి 
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి

Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం అసహనం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, ఈ చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టంగా పేర్కొంది. వాక్‌ స్వాతంత్ర్యానికి ఉన్న విలువను ప్రతి పౌరుడు తెలుసుకోవాలని, ఇలాంటి అంశాల్లో అందరూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ శర్మిష్ఠా పనోలీపై వజహత్‌ ఖాన్‌ పెట్టిన ఫిర్యాదుతో సంబంధించి విచారణ చేపట్టిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

వివరాలు 

సోషల్‌ మీడియా వేదికగా పెరుగుతున్న విభజన ధోరణి

''విద్వేష ప్రసంగాలు చేసే వ్యక్తులకు అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావడం లేదు? ఇటువంటి వ్యాఖ్యలను మరింత వ్యాప్తి చేయకుండా నియంత్రించే చర్యలు అవసరం. ప్రజలు కూడా ఇలాంటి వ్యాఖ్యలను షేర్‌ చేయడం మానుకోవాలి. మేము సెన్సార్‌షిప్‌ గురించి మాట్లాడటం లేదు. కానీ ప్రజలు స్వయంగా ఆత్మపరిశీలన చేసుకుని ఇలాంటి విషయాలను వ్యాప్తి చేయకుండా దూరంగా ఉండాలి. సోషల్‌ మీడియా వేదికగా పెరుగుతున్న విభజన ధోరణిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది'' అని ధర్మాసనం పేర్కొంది.

వివరాలు 

ప్రజలు వాక్‌ స్వాతంత్ర్యాన్ని, భావవ్యక్తీకరణ విలువను అర్థం చేసుకోవాలి

''ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల జోక్యం అవసరం లేదనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుతమైన ఆంక్షలు అవసరమవుతాయి. ప్రజలు వాక్‌ స్వాతంత్ర్యాన్ని, భావవ్యక్తీకరణ విలువను అర్థం చేసుకోవాలి'' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాలను నియంత్రించడంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకునే మార్గాలను సూచించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.