Page Loader
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 23, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగ పరిషత్‌‌కు 1957లోనే కాలపరిమితి ముగిసిందని, ఆ మేరకు 370వ అధికరణానికీ కాలం చెల్లిందని పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది. మరోవైపు జమ్ముకశ్మీర్‌కూ భారత రాజ్యాంగం వర్తిస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజ్యాంగంలోని ఆర్టికల్ 5కూ ఇదే చెబుతోందని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించిన 370వ ఆర్టికల్‌ను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.

DETAILS

రాజ్యాంగ పరిషత్‌ చర్చలను పరిశీలిస్తాం : సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగానికి గడువు పూర్తైంది కాబట్టి ఆర్టికల్ 370 కింద అధికారాలన్నీ చెల్లవని ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది దినేశ్‌ ద్వివేది అన్నారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, 1957 జనవరి 26 తర్వాత అది మనుగడలో లేనట్లేనన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, రద్దును వ్యతిరేకిస్తున్న వాదనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఒకే దేశం, ఒకే రాజ్యాంగం నిబంధన ఎక్కడ ఉందని ద్వివేది ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్టికల్‌ 370 వెనుక రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశం తెలుసుకునేందుకు రాజ్యాంగ పరిషత్‌ చర్చలను పరిశీలిస్తామని వివరించింది. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే క్రమంలోనే అప్పటి భారత ప్రభుత్వంతో ఒప్పందం మేరకే ప్రత్యేక హోదా కల్పించారని ప్రతివాదులు వాదిస్తున్నారు.