తెలంగాణ, ఏపీలతో పాటు 7 హైకోర్టులకు కొత్త సీజేలు.. సుప్రీం కొలీజియం సిఫారసు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో 7 రాష్ట్రాలకు చెందిన హైకోర్టుల్లో నూతనంగా నియామకమైన ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బాంబే, గుజరాత్, తెలంగాణ, ఏపీ, గుజరాత్, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాలకు కొత్త సారథులను నియమించారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న సునీతా అగర్వాల్ కు పదోన్నతి కల్పిస్తూ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది.
సిఫార్సుల ప్రకారం అందరూ సీజేలుగా సరిపోతారు : సుప్రీం
బాంబే హైకోర్టు జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిష్ తలపత్ర (ఒడిశా), గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆశిష్ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేసింది. కొలీజియం సిఫారసు మేరకు ఆయా న్యాయమూర్తులంతా వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా అర్హత కలిగి ఉన్నారని కోలీజియం తెలిపింది.
పదోన్నతిపై సుప్రీంకోర్టుకు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
తెలంగాణకు ప్రస్తుతం సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యవహరిస్తున్నారు. బదిలీల్లో భాగంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. మరోవైపు తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలకు పదోన్నతి దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్ కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఆయా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించాక పదోన్నతులు అమల్లోకి రానున్నాయి.