Puja Khedkar: సుప్రీంకోర్టులో పూజా ఖేద్కర్ కు ఊరట.. అరెస్టు నుంచి ఉపశమనం..!
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టులో మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్‌కు ఊరట లభించింది.
ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో పూజా ఖేద్కర్ తరఫున న్యాయవాది, ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై స్పందించేందుకు మరింత గడువు కోరారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసి, ఆ సమయంలో ఆమెను అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
పూజా ఖేద్కర్‌కు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు.
వివరాలు
విచారణలో ఆలస్యం
ఆమె ఎవరి సహాయంతో నకిలీ దివ్యాంగుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించిందో తెలుసుకోవాలని, ఆ పత్రం ఆధారంగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన విషయాన్ని విచారించాలని కోర్టుకు తెలిపారు.
పూజా తరఫున సీనియర్ న్యాయవాది బీనా మాధవన్ కోర్టుకు హాజరై, ఆమె దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అయితే, విచారణలో ఆలస్యం జరుగుతోందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
విచారణను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు ఆదేశించింది. పూజా ఖేద్కర్‌పై 2022 యూపీఎస్సీ పరీక్షకు నకిలీ పత్రాలు సమర్పించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
వివరాలు
సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమె ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు దాన్ని తిరస్కరించింది.
అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాత్కాలిక ఊరట లభించింది.
అంతేకాక, పూజా ఖేద్కర్ శిక్షణ సమయంలో వసతి, సిబ్బంది, కారు, ప్రత్యేక కార్యాలయ క్యాబిన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అలాగే, ఆమె ఐఏఎస్ అయ్యేందుకు నకిలీ పత్రాలను సమర్పించిందని, యూపీఎస్సీ ఫామ్‌లో తాను ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌గా, దృష్టిలో లోపం ఉన్నట్లు చూపించిందని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.