Andhrapradesh: ఏపీ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ప్రకటించింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.
సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ
ఈ సందర్భంగా, తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ, రాబోయే మూడు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.