దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి ఫిర్యాదుల కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు విచారణను ముగించినట్లు ప్రకటించిన నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా వాదనలు వినిపించారు. దిల్లీ పోలీసుల దర్యాప్తును తీరును పర్యవేక్షించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసు తాము పర్యవేక్షించబడటానికి తగినది కాదని తాము చెప్పడం లేదని, ఏవైనా సమస్యలు ఉంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు.
ఫిర్యాదు చేసిన బాలికలకు ప్రత్యేక భద్రత
దిల్లీ పోలీసులు ఏప్రిల్ 29న మైనర్ వాంగ్మూలాన్ని, మే 3న మరో నలుగురి వాంగ్మూలాలను నమోదు చేశారని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సీఆర్‌పీసీలోని సెక్షన్ 164 ప్రకారం మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలాలను నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసిన మైనర్‌కు భద్రతా ఏర్పాట్లు చేశామని, జంతర్ మంతర్ వద్ద మరో ఆరుగురు బాలికలకు కూడా భద్రత కల్పించామని దిల్లీ పోలీసుల తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.