Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. మాజీ మంత్రి అభ్యర్ధనకు నిరాకరణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మధ్యప్రదేశ్‌కు కేసు బదిలీ చేయాలనే ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనను తిరస్కరించింది. ఒకవేళ, కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య కాల్ రికార్డింగ్స్
ముఖ్యమంత్రి,హోం మంత్రి జోక్యం చేసుకోరాదని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఏసీబీ అధికారులు దర్యాప్తు వివరాలను సీఎం, హోం మంత్రికి నివేదించరాదని ఆదేశించింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్యెల్సీ ఎన్నికల సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఏసీబీకి ప్రధాన అంశంగా నిలిచాయి. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి మధ్య కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చింది.
పిటిషన్‌పై విచారణ ముగిసింది
అంతేకాకుండా, స్టీఫెన్‌సన్ నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యిన వీడియో ఫుటేజ్ కూడా సంచలనం సృష్టించింది. ఆ కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్‌గా మారింది ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో తెలంగాణ ప్రభుత్వం సహా రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో, కేసును బదిలీ చేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు పేర్కొంది.