
HCU: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కంచ గచ్చిబౌలిలోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు (Supreme Court), కీలక ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసు గురువారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించారు.
ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, "ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటుంది?" అని ప్రశ్నించింది. ఈ వ్యవహారం అత్యంత తీవ్రమైనదని పేర్కొంది. వార్తా కథనాలను అమికస్ క్యూరీ కోర్టు ముందు ప్రస్తావించారు.
వివరాలు
తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ప్రతివాదిగా చేర్చింది.
"అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏమిటి?" అని ప్రశ్నించింది. ఈ భూమి అటవీ భూమి కాకపోయినా, చెట్లు తొలగించే ముందు కేంద్ర పర్యావరణ సంఘం (CEC) అనుమతి తీసుకున్నారా?" అని నిలదీసింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం సాధారణ విషయం కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సుప్రీం కోర్టు, సమాధానం ఇవ్వాలని కోరింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
వివరాలు
ఇది అటవీ భూమి కాదని ఆధారాలు లేవు
ఇవాళ ఉదయం కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలలోగా నివేదిక అందించాలని సుప్రీం ఆదేశించింది.
30 సంవత్సరాలుగా ఈ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
"ఇది అటవీ భూమి కాదని ఆధారాలు లేవు" అని కోర్టులో వాదించారు. అయితే, ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, "ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలి" అంటూ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.