ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు
భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఈ కమిటీ సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకం జరుగుతుందని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్ రాయ్, సీటీ రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ కీలక తీర్పును వెలువరించింది.
బ్యాలెట్ శక్తి ఎంతటి రాజకీయ పార్టీలనైనా గద్దె దింపగలదు: జస్టిస్ జోసెఫ్
ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. న్యాయమైన, చట్టబద్ధమైన పద్ధతిలో వ్యవహరించడం, రాజ్యాంగంలోని నిబంధనలు, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు గురువారం రెండు కీలక తీర్పులు ఇచ్చింది. ఆ రెండు కూడా ఏకగ్రీవంగా ఇవ్వడం గమనార్హం. తీర్పు సందర్భంగా జస్టిస్ జోసెఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల శక్తి- ప్రజాస్వామ్యం మధ్య విడదీయరాని బంధం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. బ్యాలెట్ శక్తి అత్యున్నతమైనదని, అది ఎంతటి రాజకీయ పార్టీలనైనా గద్దె దింపగలదని చెప్పారు. ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసనతో సమానంగా ఉంటుందని జస్టిస్ అజయ్ రస్తోగి తన ప్రత్యేక పేర్కొన్నారు.