Loading...
Deepak Prakash: ఎన్నిక కాకుండానే మంత్రి పదవి.. దీపక్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దీపక్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Deepak Prakash: ఎన్నిక కాకుండానే మంత్రి పదవి.. దీపక్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల్లో విజయం సాధించని వ్యక్తిని ఎంతకాలం మంత్రి పదవిలో కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ వ్యవహారంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఆరు నెలల రాజ్యాంగ గడువు పూర్తైన తర్వాత కూడా ఆయన మంత్రి పదవిలో కొనసాగడంపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాజ్యాంగం ప్రకారం శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం లేని వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చు. అయితే అలాంటి వ్యక్తి ఆరు నెలల్లోపు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి లేదా శాసనమండలి సభ్యుడిగా ఎంపిక కావాలి. లేదంటే మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది.

వివరాలు 

2025 నవంబర్‌లో బిహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా

దీపక్ ప్రకాశ్ 2025 నవంబర్‌లో బిహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం 2026 ఏప్రిల్ 25వరకు ఆ పదవిలో కొనసాగారు.ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో మొత్తం మంత్రివర్గం రద్దైంది.

అనంతరం సమ్రాట్ చౌధరీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా,కొత్త కేబినెట్‌లో దీపక్ ప్రకాశ్‌కు మరోసారి మంత్రి పదవి దక్కింది.

ఈ రెండు పదవీకాలాల మధ్య ఆయన సుమారు 22రోజులపాటు ఎలాంటి మంత్రి పదవిలో లేరు.

ఈ విరామాన్ని ఆధారంగా చేసుకుని మరోసారి కొత్తగా ఆరు నెలల గడువు వర్తింపజేసినట్లు ప్రభుత్వం వ్యవహరించడమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది.

ఒకే వ్యక్తికి రాజ్యాంగంలోని ఆరు నెలల నిబంధనను రెండుసార్లు వర్తింపజేయడం చట్టబద్ధమేనా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీపక్ ప్రకాశ్ ఇప్పటికీ ఎన్నికల్లో గెలవకపోయినా ఆయనను రెండోసారి మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇది రాజ్యాంగ నిబంధనలను పక్కదోవ పట్టించడమేనని పిటిషనర్ వాదించారు.

అందువల్ల ఆయన మంత్రి నియామకాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోర్టును కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఇది రాజ్యాంగంలోని చట్టపరమైన నిబంధనల అమలుకు సంబంధించిన అంశం. ఎన్నిక కాకుండా ఒక వ్యక్తి ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వివరించాలి" అని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రమాణస్వీకార కార్యక్రమం సమయంలో వార్తల్లో..

ఇదిలా ఉండగా, దీపక్ ప్రకాశ్ గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా కూడా వార్తల్లో నిలిచారు.

సాధారణంగా రాజకీయ నాయకులు కుర్తా, పైజామా లేదా ధోవతీతో హాజరవుతుండగా, ఆయన మాత్రం క్యాజువల్ షర్ట్, ప్యాంట్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అదే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు.

దీపక్ ప్రకాశ్ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధినేత ఉపేంద్ర కుశ్వాహా కుమారుడు. ఆయన తల్లి ప్రస్తుతం బిహార్ శాసనసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

ADVERTISEMENT