
Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు..
ఈ వార్తాకథనం ఏంటి
ఒక పోక్సో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఎటువంటి శిక్షను విధించలేదు.
ఇందుకు కారణం, కేసుకు సంబంధించి ఉన్న ప్రత్యేక పరిస్థితులేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేసు పూర్వపరాలివీ..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువకుడిపై,ఓ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
ట్రయల్ కోర్టు ఈ వ్యక్తిని దోషిగా నిర్ధారించి,20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ,ఆయన కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు 2023 అక్టోబర్ 18న ఈ కేసుపై సంచలన తీర్పు ఇచ్చింది.
బాలిక స్వచ్ఛందంగా సంబంధాన్ని కొనసాగించినందున,అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
వివరాలు
సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
"కేవలం రెండు నిమిషాల లైంగిక లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు..కిశోర వయసులోని బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి" అని పేర్కొంది.
ఈ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంది.
అలాగే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు,హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, దోషికి విధించిన శిక్షను పునరుద్ధరించింది.
అయితే, విచారణ సమయంలో బాధితురాలు నిందితుడిని పెళ్లి చేసుకుని, ఇద్దరూ కలిసి జీవిస్తున్నారని, ఒక బిడ్డకు జన్మనిచ్చిందని న్యాయస్థానానికి తెలిసింది.
వివరాలు
నిపుణుల కమిటీ ఏర్పాటు
ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి బాధితురాలితో మాట్లాడమని ఆదేశించింది.
కమిటీ సమర్పించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించింది. 2024 ఏప్రిల్ 3న, ధర్మాసనం బాధితురాలిని వ్యక్తిగతంగా చర్చించేందుకు పిలిపించింది.
ఆమె పదోతరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత, జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోర్టు సూచించింది.
తాజాగా, ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. న్యాయస్థానం పేర్కొన్నదేమిటంటే, బాధితురాలు ప్రస్తుతం ప్రౌఢురాలు (మేజర్) అయ్యింది.
చట్టపరంగా జరిగిన ఘటనను నేరంగా పరిగణించినప్పటికీ, బాధితురాలికి అది నేరంగా అనిపించట్లేదని పేర్కొంది.
ఆమె మానసికంగా తీవ్ర ప్రభావానికి గురికాకపోయినా, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నదని తెలిపింది.
వివరాలు
పోక్సో కేసులో నిందితుడికి ఎటువంటి శిక్ష విధించకుండా తీర్పు
ఈ కేసులో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా బాధితురాలు ప్రస్తుతం నిందితుడితో కుటుంబ బంధాన్ని కొనసాగిస్తున్న దృష్ట్యా, ఆమె హితాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం తన విచక్షణాధికారం వినియోగించింది.
ఫలితంగా, ఈ పోక్సో కేసులో నిందితుడికి ఎటువంటి శిక్షను విధించకుండా తీర్పు వెలువరించింది.