మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో చేలరేగిన జాతి ఘర్షణల కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మణిపూర్‌లో పరిస్థితిపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతోందని తుషార్ మెహతా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను వివరించడానికి తుషార్ మెహతా సమయం కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది.
క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవాలనుకుటున్నాం: సుప్రీంకోర్టు
మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యల అప్డేట్ రిపోర్డును సమర్పించేందుకు ఎక్కువ సమయం లేదని సీజేఐ అన్నారు. పునరావాస శిబిరాలు, ఆయుధాల పునరుద్ధరణ, శాంతిభద్రతలపై సవివరమైన స్టేటస్ రిపోర్డును తమ సమర్పించాలని సొలిసిటర్ జనరల్‌కు సీజేఐ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తీవ్రవాద సంస్థల సభ్యులు కూడా హింసలో పాల్పడుతున్నారన్న 'ఇంటర్నేషనల్ మెయిటీ ఆర్గనైజేషన్' ఆరోపణలపై వాస్తవాలను తెలియజేయాలని న్యాయస్థానం సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.