Supreme Court: 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. స్థానికత వర్తించదన్న సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. ఇంటర్ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా స్థానికత కోల్పోయిన విద్యార్థినికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ స్థానికురాలిగా పరిగణించాలని కోరుతూ జెల్ల అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబరు 8న జారీ చేసిన జీవో నంబరు 150 ప్రకారం.. ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులకే స్థానికత వర్తిస్తుంది. ఈ నిబంధనను అంకితకు కూడా వర్తింపజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నాలుగేళ్ల నిబంధన నుంచి ఆమెకు మినహాయింపు ఇవ్వడానికి అవకాశం లేదని పేర్కొంది.
వివరాలు
మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేశారా?: సుప్రీం
ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ,జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్యార్థిని తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ..''అంకిత తెలంగాణలోనే పుట్టారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. మెరుగైన కోచింగ్ కోసం మాత్రమే ఇంటర్ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చదివారు. ఆమె తల్లిదండ్రులు,తాత,అవ్వ కూడా తెలంగాణలోనే నివసిస్తున్నారు.ఇది ప్రత్యేక పరిస్థితులతో కూడిన కేసు''అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై జస్టిస్ పీఎస్ నరసింహ స్పందిస్తూ.. ''మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేశారా?'' అని ప్రశ్నించారు.
ఆ జీవోను గతంలోనే సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తుచేశారు.
అందులో పేర్కొన్న నాలుగేళ్ల నిబంధన అంకితకు కూడా వర్తిస్తుందని, ఈ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేవని స్పష్టం చేశారు.
వివరాలు
చదువు కోసం విద్యార్థిని స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు
అయితే విద్యార్థిని తరఫు న్యాయవాది మరోసారి వాదిస్తూ.. ''తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు అక్కడే చదివిన విద్యార్థి హక్కులను కేవలం ఇంటర్ చదువు కోసం రెండేళ్లు మరో రాష్ట్రానికి వెళ్లినందుకు తొలగించడం ఏకపక్షంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇటు తెలంగాణకు స్థానికురాలిగా లేకుండా పోయారు'' అని పేర్కొన్నారు.
అంకిత తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారా? అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు.
అందుకు న్యాయవాది లేదని సమాధానమిచ్చారు. చదువు కోసం విద్యార్థిని స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారని వివరించారు.
వివరాలు
పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ''తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా కాకుండా, మీ స్వంత నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇది భిన్నమైన పరిస్థితి. అందువల్ల ప్రత్యేక వెసులుబాటు కోరలేరు. అలా మినహాయింపు ఇస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల ఉద్దేశం దెబ్బతింటుంది'' అని పేర్కొంది.
ఈ నేపథ్యంలో అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
దీంతో 2026-27 ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో తెలంగాణ స్థానికురాలిగా పరిగణించాలని ఆమె చేసిన విజ్ఞప్తికి అవకాశం లేకుండా పోయింది.