Supreme Court: నేడు సుప్రీంకోర్టులో సంజయ్ రాయ్ జీవితఖైదుపై విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు శిక్ష ఖరారైంది.
కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మరోసారి పరిశీలించనుంది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై సమగ్ర విచారణ చేయనుంది.
అదే సమయంలో, కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు తీర్పుపై, సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలన్న అభ్యర్థనతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ అప్పీల్‌ను విచారణకు అంగీకరించింది.
వివరాలు
ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్
గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీ రాత్రి, ఆర్జీ కర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను కోల్‌కతా పోలీసుల నుండి సీబీఐకి అప్పగించారు.
సీబీఐ దర్యాప్తులో ఆధారాలు సేకరించి, ప్రత్యేక కోర్టుకు సమర్పించింది.
ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరు మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.
సామూహిక అత్యాచారం అంశాన్ని అభియోగపత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేశారు.
వివరాలు
అత్యాచారానికి, హత్యకు వెనుక పెద్ద కుట్ర
జీవిత ఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ చేశారు. "పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తాము" అని వారు పేర్కొన్నారు.
"ఈ నేరంలో ఇతర భాగస్వాములు ఉన్నారు. వీరిని వదిలిపెట్టారు. ఇది అరుదైన కేసు కాదా? విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ అత్యాచారానికి, హత్యకు గురైంది" అంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అభిప్రాయపడ్డారు.