
Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజగా,ఈ పునర్విభజనకు సంబంధించిన మెమోను సమర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని స్టాలిన్ సమయం కోరారు.
ఈ నేపథ్యంలో, గత నెల 27న మోదీకి లేఖ రాశారు.ఈ లేఖను బుధవారం స్టాలిన్ ఎక్స్ (Twitter) వేదికగా పంచుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందని భావిస్తూ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో స్టాలిన్ ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ నేపథ్యంలో, తాము సిద్ధం చేసిన మెమోను ప్రధానికి అందించేందుకు సమయం ఇవ్వాలని స్టాలిన్ కోరారు.
వివరాలు
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదం
ఈ అంశంపై తమ వినతిని వ్యక్తం చేసే అవకాశాన్ని వెంటనే కల్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై తగిన స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం, 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీని ప్రక్రియలో అనుసరించబోయే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల డీఎంకే (DMK) నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో, జనాభా ప్రాతిపదికన జరిగే ఈ పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
దీనివల్ల చట్టాల రూపకల్పనలో దక్షిణాది ప్రాంతాలకు ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు.
తాము రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
వివరాలు
కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన
అయితే, తమ నిరసన పునర్విభజనను పూర్తిగా వ్యతిరేకించడానికి కాదని, కానీ ఇది న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎలాంటి చర్చల లేకుండానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేయాలని భావిస్తుండటం ప్రమాదకరమైన సంకేతమని అభిప్రాయపడ్డారు.