LOADING...
Tahawwur Rana: 'అవును.. నేను పాక్‌ ఆర్మీ ఏజెంట్‌నే'.. 26/11 దాడుల్లో తన పాత్రను అంగీకరించిన తహవ్వూర్ రాణా

Tahawwur Rana: 'అవును.. నేను పాక్‌ ఆర్మీ ఏజెంట్‌నే'.. 26/11 దాడుల్లో తన పాత్రను అంగీకరించిన తహవ్వూర్ రాణా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడులకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడులకు ప్రధాన కుట్రదారుల్లో ఒకడిగా భావించబడుతున్న తహవూర్‌ హుస్సేన్‌ రాణా, తాను నేరం చేసిన విషయాన్ని స్వయంగా అంగీకరించాడు. అంతేకాకుండా,తాను పాకిస్థాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయత కలిగిన ఏజెంట్‌గా పనిచేశానని కూడా విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ వివరాలను ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సోమవారం తన కథనంలో వెల్లడించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన తహవూర్‌ రాణా.. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్‌ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కస్టడీలో ఉన్నాడు. అయితే ముంబయి క్రైం బ్రాంచ్‌ చేపట్టిన విచారణలో,2008లో జరిగిన ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్న విషయాన్ని రాణా అంగీకరించాడు.

వివరాలు 

2008 నవంబర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో.. ముంబయిలోనే ఉన్న రాణా

అదేవిధంగా,లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ ద్వారా జరిగిన పలు శిక్షణా శిబిరాల్లో తాను తన స్నేహితుడు డేవిడ్ హెడ్‌లీతో కలిసి పాల్గొన్నట్లు వెల్లడించాడు. లష్కరే తోయిబా పేరు చెబుతుంటే అది కేవలం ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు, ముఖ్యంగా పాక్‌కు చెందిన గూఢచార సంస్థగా కూడా పనిచేస్తుందని రాణా చెప్పినట్టు తెలుస్తోంది. ముంబయిలో ఒక ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌ ప్రారంభించాలని తాను భావించినట్లు, ఆ కార్యాలయం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా చూపిస్తూ అమలుపరిచినట్లు తెలిపాడు. అంతేకాక, 2008 నవంబర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని, అది దాడులకు సంబంధించిన పక్కా ప్రణాళికలో భాగమేనని అంగీకరించాడు.

వివరాలు 

కేసులో కీలక మలుపు

దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (CST) వంటి ముఖ్య ప్రాంతాలను తాను స్వయంగా పరిశీలించినట్లు కూడా పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఈ దాడుల వెనుక పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని స్పష్టం చేశాడు. ఈ వివరాలను ఇండియా టుడే ప్రచురించిన కథనంలో వెల్లడించింది. ఇక గతంలో తనపై వచ్చిన ఆరోపణలను తహవూర్‌ రాణా ఖండిస్తూ వస్తున్నప్పటికీ, తాజా విచారణలో తన పాత్రను ఒప్పుకోవడం, పాక్ నిఘా వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం ద్వారా ఈ కేసులో కీలక మలుపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.