Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్
ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ మందుల సరఫరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే యాంటీబయాటిక్స్‌లో స్టార్చ్, టాల్కం పౌడర్ కలిపి తయారు చేసినట్లు విచారణలో తేలింది. నకిలీ మందుల సరఫరా కేసులో దాఖలైన 1,200పేజీల ఛార్జ్ షీట్ నుంచి ఈ విషయం వెల్లడైంది. హరిద్వార్‌లోని ల్యాబ్‌లో నకిలీ యాంటీబయాటిక్స్‌ను తయారు చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది. జంతువుల చికిత్స కోసం ఇక్కడ మందులు తయారు చేస్తారు. ఇక్కడ తయారైన నకిలీ మందులు మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్,జార్ఖండ్‌లోని ఆసుపత్రులతో సహా భారతదేశం అంతటా సరఫరా అయ్యాయి. నకిలీ మందుల తయారీ,విక్రయాల్లో నిమగ్నమైన వ్యాపారులు హవాలా మార్గాల ద్వారా నగదు లావాదేవీలు జరిపారు. ముఠా సభ్యులు ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు లక్షలాది డాలర్లను పంపించారు.
నకిలీ మందుల సరఫరాలో హేమంత్ ములే ప్రధాన నిందితుడు
నకిలీ మందుల సరఫరా కేసులో హేమంత్ ములే ప్రధాన నిందితుడు. ప్రభుత్వ ఆసుపత్రులు జారీ చేసిన టెండర్‌లో పాల్గొన్నాడు. దీంతో పాటు మిహిర్ త్రివేది, విజయ్ చౌదరి కూడా నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే మరో మోసం కేసులో జైలులో ఉన్నారు. సహరాన్‌పూర్‌కు చెందిన రాబిన్ తనేజా అలియాస్ హిమాన్షు, అతని సోదరుడు రామన్ తనేజా కూడా ఈ నకిలీ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారు. వారిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తనేజా సోదరులు అమిత్ ధీమాన్ పేరు పెట్టారని ఐపీఎస్ అధికారి అనిల్ మస్కే అన్నారు. దీని తర్వాత మేము హరిద్వార్‌లోని అతని ల్యాబ్‌కు చేరుకున్నాము.ధీమాన్‌ను ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది.అతను జైలులో ఉన్నాడు.నకిలీ మందుల కేసులో అరెస్టయ్యాడు.
ఫేక్ మెడిసిన్ కేసు ఎలా బయటపడింది?
మహారాష్ట్రకు చెందిన ఎఫ్‌డిఎ (Food and Drug Administration) డిసెంబర్ 2023లో నకిలీ మందులను తయారు చేసి సరఫరా చేస్తున్న ఈ రాకెట్‌ను ఛేదించింది. నాగ్‌పూర్ సివిల్ సర్జన్ నేతృత్వంలో ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (IGGMCH) దుకాణాల్లో సుమారు 21,600 సిప్రోఫ్లోక్సాసిన్ 500 mg టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఔషధాల నమూనాలను పరిశీలించిన తర్వాత, వాటిలో ఔషధ గుణాలు లేవని FDA తెలిపింది. మందులు పూర్తిగా నకిలీవి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి న్యుమోనియా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రూపొందించిన యాంటీబయాటిక్ మాత్రలు 2022- 2023 లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సివిల్ ఆసుపత్రులకు పంపిణీ చేయబడ్డాయి.