Tamilnadu Viral Video: కొత్త కారుకు పూజ చేసే సమయంలో.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
తమిళనాడులోని కడలూరులో ఆలయంలో పూజల సందర్భంగా కొత్త కారు ప్రమాదానికి గురైంది. వాస్తవానికి,కారు యజమాని బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌పై కాలు పెట్టాడు.దీంతో కారు అకస్మాత్తుగా వెళ్లి ఆలయ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా బయటకు వచ్చింది.ఆలయం ముందు ఆగి ఉన్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలి ఆలయంలోకి ఎలా ప్రవేశించిందో స్పష్టంగా కనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కడలూరు జిల్లాలోని శ్రీమూషణం ప్రాంతంలోని ఓ ఆలయానికి సుధాకర్ అనే వ్యక్తి తన కొత్త కారుకు పూజలు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. సంప్రదాయం ప్రకారం కొత్త వాహనానికి పూజ అనంతరం ఆలయం ముందు వాహనాన్ని డ్రైవర్ నెమ్మదిగా తరలించాల్సి వచ్చింది.
బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ నొక్కారు
కారు పూజ అనంతరం సుధాకర్ కారును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. పొరపాటున యాక్సిలరేటర్‌ను నొక్కగా కారు ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. దీంతో వాహనం అకస్మాత్తుగా అతి వేగంతో ముందుకు వెళ్లి అదుపు తప్పి గుడి లోపలికి ప్రవేశించి స్తంభాన్ని ఢీకొట్టింది. పూజ సమయంలో ఓ వ్యక్తి కారు కిటికీ దగ్గర నిల్చుని లోపల కూర్చున్న కారు యజమాని సుధాకర్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని కూడా కారు ఈడ్చుకుంటూ వెళ్ళింది.
ఆలయ ప్రాంగణంలో గందరగోళం
ఈ ప్రమాదంలో కొత్త కారు పూర్తిగా దెబ్బతింది.వాహన యజమానికి ఏమీ జరగకపోవడం విశేషం. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. అనంతరం అక్కడకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తమ వెంట తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.