
Agra: భార్య వేధింపులకు మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. భావోద్వేగ వీడియో రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మానవ్ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
తన మరణానికి ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియోను రికార్డ్ చేసి, అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఆ వీడియోలో కన్నీళ్లతో మానవ్ మాట్లాడుతూ... తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె ప్రవర్తనపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె తరచూ దురుసుగా ప్రవర్తించేదని వెల్లడించారు. గతంలో కూడా తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశానని, అయితే ఇప్పుడు భార్య వల్ల మరింత మానసిక ఒత్తిడికి గురై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. వివరించారు.
వివరాలు
భావోద్వేగ వీడియోలో ఏముంది?
6 నిమిషాల 57 సెకన్ల ఆ వీడియోలో మానవ్ తన తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేస్తూ, "పాపా, మమ్మీ, అక్కూ, సారీ...ఇక నేను వెళ్లిపోతున్నా"అని అన్నారు.
సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పురుషులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని, వారిపైనా సమాజం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. చివరకు,మానవ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
తండ్రి ఫిర్యాదు
మానవ్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు గత ఏడాది వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
పెళ్లి తర్వాత మానవ్ తన భార్యను ముంబైకి తీసుకెళ్లారని,అయితే అక్కడ ఆమె తరచూ గొడవలు పెట్టేదని,కుటుంబంపై తప్పుడు కేసులు వేస్తామని బెదిరించేదని ఆరోపించారు.అంతేకాకుండా,ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానముందని చెప్పారు.
వివరాలు
ఇదే తరహాలో మరో ఘటన!
ఫిబ్రవరి చివర్లో,మానవ్ తన భార్యను తీసుకుని ఆగ్రాకు తిరిగి వచ్చారు.అయితే, కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు.
మానవ్ తండ్రి ప్రకారం,కోడలు తన కుటుంబ సభ్యులతో కలిసి మానవ్‌ను బెదిరించిందని,ఆ ఒత్తిడిని తట్టుకోలేక మానవ్ ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
ఈ సంఘటన బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెచ్చింది.అతుల్ కూడా తన భార్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈరెండు ఘటనల్లోనూ భార్యల మానసిక,భావోద్వేగ వేధింపులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
మానవ్ శర్మ కేసును పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.తన భార్యను,ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
మానవ్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియో ఆధారంగా కూడా విచారణ జరుపుతున్నారు.ఈ కేసుపై మరింత సమాచారం త్వరలో వెలువడనుంది.